పనులు అడ్డుకున్న అన్నదాతలు...

కోనరావుపేట//జూలై 27 (ఆకాంక్ష) :

కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలోని ఇసుక క్వారీ వద్ద సోమవారం రైతుల నిరసనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనుమతులకు మించి నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ స్థానిక రైతులు క్వారీ వద్దకు చేరుకుని పనులను అడ్డుకున్నారు. ఇసుక తరలింపునకు ఉపయోగిస్తున్న వాహనాలు, యంత్రాలను నిలిపివేసి తమ నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, క్వారీ నిర్వహణకు అధికారులు కేవలం 3.5 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ, కాంట్రాక్టర్లు దాదాపు 10 ఎకరాల మేర అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపించారు. అనుమతులకు విరుద్ధంగా జరుగుతున్న ఈ తవ్వకాల వల్ల వర్షాకాలంలో వాగు సహజ ప్రవాహానికి తీవ్ర అంతరాయం కలిగే ప్రమాదం ఉందని తెలిపారు.అధికంగా ఇసుక తవ్వడం వల్ల వాగు పరివాహక ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు కోతకు గురయ్యే అవకాశం ఉందని, వరద నీరు పొలాల్లోకి చేరి పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే అక్రమ తవ్వకాల కారణంగా భూగర్భ జలాల మట్టం మరింత దిగజారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.సంబంధిత అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి అక్రమ ఇసుక తవ్వకాలను తక్షణమే నిలిపి వేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు.