గోదావరిఖనిటౌన్//జూలై 27(ఆకాంక్ష) :

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నృత్యమాల నాట్య కళా వెల్ఫేర్ సొసైటీ, సిరి ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన "తెలంగాణ బోనాల సంబరాలు–2026" కార్యక్రమంలో విశేష ప్రతిభ కనబర్చిన శ్రీ చైతన్య హై స్కూల్ విద్యార్థులకు సోమవారం మెమెంటోలు ప్రదానం చేశారు. స్థానిక ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని శ్రీ చైతన్య హై స్కూల్‌కు చెందిన విద్యార్థులు తెలంగాణ బోనాల సంబరాల సందర్భంగా నిర్వహించిన నృత్య ప్రదర్శనల్లో పాల్గొని తమ ప్రతిభను చాటడంతో పాటు మెమెంటోలను గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఉదయ్ కుమార్ చేతుల మీదుగా విద్యార్థినీ, విద్యార్థులకు మెమెంటోలు అందజేశారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు రాష్ట్ర స్థాయి వేదికపై ప్రతిభ కనబర్చి పాఠశాలకు మంచి పేరు తీసుకురావడం గర్వకారణమని అన్నారు. ఈ విజయానికి కృషి చేసిన డాన్స్ మాస్టర్ కొలిపాక దేవేందర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రశంసిస్తూ భవిష్యత్తులోనూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు .కార్యక్రమంలో డాన్స్ మాస్టర్ దేవేందర్,అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నరేంద్ర కుమార్, డీన్ రమేష్, ప్రైమరీ ఇన్‌చార్జి శైలజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.