భువనగిరి//జూలై 26 (ఆకాంక్ష):

చేపల వేటకు వెళ్లిన ముగ్గురు యువకుల్లో ఒకరు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన విషాద ఘటన భువనగిరి మండలం బస్వాపూర్ ప్రాజెక్టులో ఆదివారం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు యువకులు బస్వాపూర్ ప్రాజెక్టు వద్దకు చేపల వేట కోసం వెళ్లినట్లు తెలిసింది. చేపలు పడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఒక యువకుడు లోతైన నీటిలోకి జారిపడి మునిగిపోయినట్లు సమాచారం.యువకుడు నీటిలో గల్లంతు కావడంతో అతనితో వచ్చిన మరో ఇద్దరు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొంతసేపటి అనంతరం నీటిలో నుంచి యువకుడి మృతదేహాన్ని వెలికితీసినట్లు తెలిసింది. మృతుడిని హైదరాబాద్‌కు చెందిన నయీంగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చేపల వేటకు వెళ్లిన యువకుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు.బస్వాపూర్ ప్రాజెక్టులో నీటి లోతు, ప్రమాదకర ప్రాంతాలపై అవగాహన లేకుండా చేపల వేటకు వెళ్లడం ప్రాణాంతకంగా మారిందని స్థానికులు పేర్కొన్నారు. ప్రాజెక్టు పరిసరాల్లో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు, చేపల వేటకు వెళ్లే వారిపై అధికారులు అప్రమత్తత చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.