బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌...

హైదరాబాద్//జూలై 26(ఆకాంక్ష) :

తుంగభద్ర, కృష్ణా, భీమా నదులపై కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు, హైడ్రాలిక్‌ గేట్లు ఏర్పాటు చేస్తూ తెలంగాణకు రావాల్సిన నీటిని అడ్డుకుంటోందని మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆరోపించారు. ఈ అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించి తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.కృష్ణా, భీమా నదులపై కర్ణాటక నిర్మిస్తున్న ప్రాజెక్టులను పరిశీలించేందుకు మాజీ మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, లక్ష్మారెడ్డి, నిరంజన్‌రెడ్డి నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ బృందం కర్ణాటకలో పర్యటించింది. గూడూరు వద్ద కృష్ణానదిపై ఏర్పాటు చేసిన హైడ్రాలిక్‌ గేట్లను బీఆర్‌ఎస్‌ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ కర్ణాటకలోని ప్రాజెక్టులన్నీ నీటితో నిండిపోయినప్పటికీ తెలంగాణలో మాత్రం సాగునీరు అందక పంట భూములు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.తుంగభద్ర డ్యామ్‌ పూడికతో నిండిపోయిందని, సిల్ట్‌ తొలగింపు పనులు చేపట్టకపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోందని శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. శ్రీశైలం నుంచి తెలంగాణ అవసరాలకు నీటిని ఎప్పుడైనా లిఫ్ట్‌ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కర్ణాటకలో అక్రమంగా ఏర్పాటు చేసిన హైడ్రాలిక్‌ గేట్ల కారణంగా తెలంగాణకు చుక్క నీరు కూడా రాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖకు సలహాదారుడిగా తెలంగాణకు నష్టం చేసే వ్యక్తిని నియమించారని రేవంత్‌ ప్రభుత్వంపై శ్రీనివాస్‌ గౌడ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదని, కనీసం పది శాతం పనులు కూడా పూర్తి చేసే పరిస్థితి కనిపించడం లేదని విమర్శించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో పాలమూరు ప్రాంతం తీవ్ర నీటి కొరతను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోకపోతే భవిష్యత్తులో తెలంగాణకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉండదని శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. తుంగభద్ర డ్యామ్‌లో తెలంగాణకు కూడా హక్కు ఉందని, అందువల్ల కనీసం నాలుగు టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఏర్పాటు చేసిన హైడ్రాలిక్‌ గేట్లను తక్షణమే తొలగించాలని కోరారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకపోతే పాలమూరు ప్రాంతం ఎండిపోయే ప్రమాదం ఉందని శ్రీనివాస్‌ గౌడ్‌ హెచ్చరించారు. తెలంగాణకు రావాల్సిన నీటిని విడుదల చేయకుండా అడ్డుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని అన్నారు. నీటి హక్కుల కోసం తెలంగాణ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కృష్ణా, భీమా, తుంగభద్ర నదులపై తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.