సీపీఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య...

గోదావరిఖని//జూలై 26 (ఆకాంక్ష):

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించాలని సీపీఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గోషిక మోహన్ డిమాండ్ చేశారు. కార్పొరేషన్‌లోని ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అవినీతికి పాల్పడుతున్న అధికారులపై విజిలెన్స్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.సీపీఐ నగర ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం స్థానిక భాస్కరరావు భవన్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి గోషిక మోహన్, మార్కపురి సూర్య హాజరై మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో మున్సిపల్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. అయితే కార్పొరేషన్ కార్యాలయంలోకి అడుగుపెడితే అనేక ఖాళీ కుర్చీలు కనిపించడం దారుణమని పేర్కొన్నారు.కార్పొరేషన్‌లో 50 డివిజన్లకు 257 పోస్టులు మంజూరై ఉండగా, ప్రస్తుతం 113 మంది మాత్రమే పనిచేస్తున్నారని, మరో 144 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఇంత భారీగా పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయాలనే చిత్తశుద్ధి పాలకులు, జిల్లా యంత్రాంగంలో కనిపించడం లేదని విమర్శించారు. సిబ్బంది కొరత కారణంగా ప్రజలకు అందాల్సిన మున్సిపల్ సేవలు, అభివృద్ధి పనులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో సూపరింటెండెంట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల కీలకమైన పనులపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు.ముగ్గురు డీఈలకు గాను ఇద్దరే పనిచేస్తున్నారని, వారిలో ఒకరికి ఎస్‌ఈ ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగించడంతో మరో అధికారిపై అధిక పనిభారం పడుతోందని తెలిపారు. డివిజన్లలో క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి పనులకు అంచనాలు రూపొందించాల్సిన ఏఈలు ఏడుగురికి గాను నలుగురే ఉన్నారని, దీంతో కార్పొరేటర్లు తమ డివిజన్లలో పనుల కోసం అధికారులను సంప్రదించినా సమయం కేటాయించలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు.ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలకమైన శానిటేషన్ విభాగం కూడా సిబ్బంది కొరతతో సతమతమవుతోందని సీపీఐ నాయకులు తెలిపారు. ఆరుగురు శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లు ఉండాల్సిన చోట కేవలం ఇద్దరే పని చేస్తున్నారని, వారు కూడా పూర్తి సమయాన్ని స్థానికంగా కేటాయించకపోవడం వల్ల పారిశుద్ధ్య నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దాలంటే శానిటేషన్ విభాగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలోనూ సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని వారు పేర్కొన్నారు. ఇద్దరు టౌన్ ప్లానింగ్ ఏసీపీలకు గాను ఒక్కరే ఉండగా, నలుగురు టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్లకు గాను ఇద్దరే ఉన్నారని తెలిపారు. వారిలో ఒకరు డిప్యూటేషన్‌పై ఉండటంతో ఒక్క అధికారిపైనే అధిక బాధ్యతలు పడుతున్నాయని అన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతికి ఆస్కారం ఏర్పడిందని ఆరోపిస్తూ, రాజకీయ అండదండలతో అక్రమ కట్టడాలకు ఇష్టానుసారంగా అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రామగుండం కార్పొరేషన్‌లోని ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాలపై విజిలెన్స్ విచారణ నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని, అవినీతికి పాల్పడినట్లు తేలితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అదే సమయంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను తక్షణమే భర్తీ చేసి కార్పొరేషన్ పరిపాలనను గాడిలో పెట్టాలని డిమాండ్ చేశారు.రెవెన్యూ విభాగంలోనూ పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రజలకు, కార్పొరేషన్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఇద్దరు రెవెన్యూ అధికారులు, ఒక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇంటి పన్నుల వసూళ్లు తదితర అంశాల్లో సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. కనీసం అడిషనల్ కమిషనర్ లేదా పూర్తిస్థాయి కమిషనర్‌ను నియమించలేని పరిస్థితి నెలకొనడం పాలకుల పనితీరుకు నిదర్శనమని విమర్శించారు. రామగుండం నగరంలో రోడ్ల విస్తరణ, కూల్చివేతల విషయంలో మున్సిపల్ అధికారులు శాస్త్రీయమైన విధానాన్ని అనుసరించాలని మార్కపురి సూర్య స్పష్టం చేశారు. ముందుగా రామగుండానికి సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించి ప్రజల ముందు బహిరంగ పరచాలని, ఏ ప్రాంతంలో రోడ్డు ఎంత మేరకు ఉండాలి, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రహదారుల విస్తరణ ఎలా ఉండాలనే అంశాలను మాస్టర్ ప్లాన్‌లో స్పష్టంగా నిర్ణయించిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని అన్నారు.మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డు విస్తరణకు అవసరమైన ప్రాంతాల్లో సంబంధిత భవన యజమానులకు ముందుగా నోటీసులు జారీ చేసి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. మాస్టర్ ప్లాన్ ప్రకటించకుండా కంటికి కనిపించిన నిర్మాణాలను, రోడ్డు పక్కన ఉన్న కట్టడాలను ఇష్టానుసారంగా కూల్చివేస్తే కమ్యూనిస్టు పార్టీ చూస్తూ ఊరుకోదని మున్సిపల్ కమిషనర్, అధికారులను హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, చట్టబద్ధమైన విధానంలోనే రోడ్ల విస్తరణ, కూల్చివేతలు చేపట్టాలని డిమాండ్ చేశారు.రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌ను సిబ్బంది కొరత నుంచి బయటపడేసి, పారదర్శకమైన పాలన అందించడంతో పాటు అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి ప్రజల్లో నమ్మకం కల్పించాలని సీపీఐ నాయకులు కోరారు.ఈ సమావేశంలో సీపీఐ నగర కార్యవర్గ సభ్యులు మడికొండ ఓదమ్మ, ఆశాల రమ, శనిగరపు చంద్రశేఖర్, సిరిసిల్ల మల్లేష్, కౌన్సిల్ సభ్యులు రాణవేణి సుధీర్ కుమార్, ఆశాల నవీన్, సాధుల శివ, అబ్దుల్ కరీం, తిరుమల, నాయకులు పోతరాజు నాగరాజు, అనూప్ సాయి, మసూద్ తదితరులు పాల్గొన్నారు.