నాగర్‌కర్నూల్//జూలై 26 (ఆకాంక్ష):

ప్రజా పోరాటాల ముందు కేంద్రంలోని బీజేపీ, మోదీ ప్రభుత్వ అహంకారం ఓడిపోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. బాల నరసింహ, జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో పాలకులు ఎంత నియంతృత్వ ధోరణితో వ్యవహరించినా అంతిమ విజయం ప్రజలదేనని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ఉద్యమం విజయవంతమైన సందర్భంగా ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి, అనంతరం స్వీట్లు పంచుకున్నారు.ఈ సందర్భంగా బాల నరసింహ, ఎస్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాలు దేశవ్యాప్తంగా ఉద్యమించాయని తెలిపారు. సామాజిక కార్యకర్త,శాస్త్రవేత్త సోనం వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను సైతం కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా అహంకారపూరితంగా, మొండిగా వ్యవహరించిందని విమర్శించారు. ఎన్ని పోరాటాలు జరిగినా తాము చెప్పిందే చట్టం, తాము చేసిందే న్యాయం అన్నట్లుగా వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వానికి దేశ యువత, జెన్‌-జీ తగిన గుణపాఠం చెప్పిందని అన్నారు. జూలై 20న ‘చలో పార్లమెంట్’కు పిలుపునివ్వగా దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత ఢిల్లీకి చేరుకున్నారని తెలిపారు. ఆందోళనకారులను అడ్డుకునే క్రమంలో ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గంగా ఉందని ఆరోపించారు. విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందని మండిపడ్డారు.ఢిల్లీలో ప్రారంభమైన జెన్‌-జీ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిందని నాయకులు అన్నారు. ప్రజల ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. దేశంలో ఎవరూ దేశం కంటే పెద్దవారు కాదని, పాలకులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. విద్యాశాఖ మంత్రితో పాటు ఆర్థిక, విదేశాంగ, రక్షణ, పెట్రోలియం, రోడ్డు రవాణా శాఖల మంత్రులు కూడా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంలో విఫలమయ్యారని వారు ఆరోపించారు. ఆయా మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జూలై 20న దేశ రాజధానిలో విద్యార్థులు, యువతపై ఢిల్లీ పోలీసులు జరిపిన అణచివేతకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా రాజీనామా చేయాలని కోరారు.ప్రజల హక్కులను అణచివేస్తే అవే పెద్దఎత్తున ఉద్యమాలుగా మారుతాయని, దేశంలో ఇక పోరాటాల కాలం రానుందని నాయకులు అన్నారు. నీట్ పరీక్షల్లో పాల్గొని ఆత్మహత్యలకు పాల్పడిన 22 మంది విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమకారులపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరారు. లేనిపక్షంలో ప్రస్తుత ఉద్యమాల కంటే పది రెట్లు పెద్దఎత్తున ప్రజా ఉద్యమాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఏ ప్రభుత్వం అయినా ప్రజాస్వామ్య విలువలకు లోబడి పని చేయాల్సిందేనని, ప్రజల హక్కులను కాలరాస్తే ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని అన్నారు. తమకు ఎదురు లేదని విర్రవీగిన నియంతలు చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయారని, ప్రజల తీర్పు నుంచి ఎవరూ తప్పించుకోలేరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు హెచ్. ఆనంద్, సీపీఐ జిల్లా సమితి సభ్యులు తుమ్మల శివుడు, ఎండీ కాజా మొయినుద్దీన్, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. శ్రీనివాసులు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి బండి లక్ష్మీపతి, టీ. కిరణ్‌ కుమార్, నాగర్‌కర్నూల్ పట్టణ కార్యదర్శి కొత్త రామస్వామి, వంకేశ్వరం శ్రీనివాసులు, ప్రజా నాట్యమండలి జిల్లా నాయకులు పర్వతాలు, వాసు, దాసు, సంతోష్, యాదయ్య, బాలపీర్, సంఘం కృష్ణ, కుమార్, నరసింహ, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.