మెదక్//జూలై26(ఆకాంక్ష):

మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం గంగాపూర్ శివారులో ఆదివారం రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి చెందింది. మెదక్ రామాయంపేట ప్రధాన రహదారిపై రక్తపు మడుగులో పడి ఉన్న చిరుతను స్థానికులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన చిరుతను పరిశీలించారు. చిరుత శరీరంపై గాయాలను పరిశీలించిన అధికారులు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడం వల్లే మృతి చెందినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. రహదారి దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.చిరుత మృతి విషయం తెలియడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఘటనపై అటవీ శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. చిరుత ఏ ప్రాంతం నుంచి వచ్చిందనే విషయంతో పాటు ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రహదారిపై వన్యప్రాణుల సంచారం ఉండే అవకాశం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు.