హైదరాబాద్‌లో ఉంటే ఇక్కడి సమస్యలు ఎలా పరిష్కారమవుతాయి.. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్య...

గోదావరిఖని//జూలై 25(ఆకాంక్ష). : గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి వెళ్లి ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు పబ్లిసిటీ చేసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం కాదు... ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపరిచి ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించినప్పుడే ఆసుపత్రి అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పలువురు హితవు పలుకుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ హైదరాబాద్‌లో ఉంటే గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలోని సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్య ప్రశ్నించారు. సీపీఎం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ వార్డులను పరిశీలించి, అనంతరం ఆర్‌ఎంఓ ఇన్‌చార్జి డాక్టర్ కృపాబాయిని కలిసి ఆస్పత్రిలోని మౌలిక వసతులు, శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సిబ్బంది సమస్యలు, వైద్య సేవలపై చర్చించారు.అనంతరం ఎస్. వీరయ్య మాట్లాడుతూ, మూడు జిల్లాల నుంచి రోజూ సుమారు 1,500 మందికి పైగా రోగులు ఈ ఆస్పత్రికి వస్తున్నప్పటికీ వారికి తగిన సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రోగులు,వారి సహాయకుల కోసం కనీస బాత్‌రూమ్ సదుపాయాలు కూడా లేవని, వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి ప్రాంతంలో దుమ్ము, ధూళి ప్రభావంతో కిడ్నీ సంబంధిత వ్యాధులు అధికంగా వస్తున్నప్పటికీ ఆస్పత్రిలో నెఫ్రాలజిస్టు (కిడ్నీ వైద్యుడు) లేకపోవడం బాధాకరమన్నారు. అలాగే ఎంఆర్ఐ స్కానింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఎంఆర్ఐ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.250 మంది వైద్యులు ఉండాల్సిన ఆస్పత్రిలో కేవలం సుమారు 100 మంది మాత్రమే పనిచేస్తున్నారని, వైద్యుల కొరత కారణంగా రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందడం లేదన్నారు. 13 మంది ఉన్నతాధికారుల పోస్టుల్లో ఐదు మాత్రమే భర్తీ అయ్యాయని, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.350 మంది నర్సులకు ఒకే బాత్‌రూమ్ ఉండటం, ప్రతి అంతస్తులో ఒక చిన్న విశ్రాంతి గది మాత్రమే ఉండటం దురదృష్టకరమన్నారు. పనిచేయని లిఫ్ట్ కారణంగా రోగులను పై అంతస్తులకు తరలించడం తీవ్ర ఇబ్బందిగా మారిందని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు. లిఫ్ట్ పక్కనున్న తాగునీటి ఫ్రిజ్ కూడా పనిచేయడం లేదని, దానిని కూడా అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.పేషెంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందికి 15 రోజులకు ఒకసారి డ్యూటీలు మార్చడం సరైన విధానం కాదని, వారానికోసారి మార్పులు చేయాలని సూచించారు. రెండు, మూడు నెలలకు ఒకసారి జీతాలు చెల్లించడం వల్ల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని, అవసరమైన మేరకు మ్యాన్‌పవర్‌ను పెంచాలని డిమాండ్ చేశారు.ఏఎన్‌సీ స్కానింగ్ విభాగం వద్ద తాగునీటి సౌకర్యం లేకపోవడంతో రోగులు బయటకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదన్నారు. ఆస్పత్రిలో మందుల కొరత తీవ్రంగా ఉండటంతో సగం మందులు బయట కొనాల్సి వస్తోందని, అవసరమైన మందులను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని కోరారు. రోగుల సహాయకుల కోసం కేటాయించిన ప్రదేశాన్ని డంపింగ్ యార్డ్‌గా మార్చి చెత్త, విరిగిపోయిన బెడ్‌లు, కుర్చీలు వేయడం సరికాదన్నారు. వార్డులలోని బాత్‌రూమ్‌లు అపరిశుభ్రంగా ఉండటంతో పాటు నీటి సరఫరా లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.మూడు అంతస్తుల భవనంలో లీకేజీల కారణంగా మురుగు నీరు నిల్వ ఉండి దోమలు, ఈగలు పెరిగి దుర్వాసన వస్తోందన్నారు. ఆస్పత్రి వెనుక నిర్మించిన ఆరు బాత్‌రూమ్‌లకు నెలలుగా తాళాలు వేసి ఉంచడం వల్ల అవి వినియోగానికి నోచుకోవడం లేదని విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, సరిపడా వైద్యులు, మందులు, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని ఎస్. వీరయ్య హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎ. ముత్యంరావు, వేల్పుల కుమారస్వామి, ఎం. రామాచారి, సీనియర్ నాయకుడు టి. రాజారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎన్. బిక్షపతి, ఎం. శ్రీనివాస్, జి. జ్యోతి, శైలజ, నాయకులు శివరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.