కీసర//జూలై25(ఆకాంక్ష) :

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం ప్రాంతంలో శనివారం విషాద ఘటన చోటు చేసుకుంది. పీజీ వైద్య విద్యార్థిని దీక్షిత (26) ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.పోలీసుల వివరాల ప్రకారం, దీక్షిత బెంగళూరులోని ఓ వైద్య కళాశాలలో పీజీ ఆప్తమాలజీ (కంటి వైద్యం) మొదటి సంవత్సరం చదువుతోంది. నాగారం ప్రాంతంలో ఉన్న భవనం ఐదో అంతస్తు నుంచి ఆమె దూకినట్లు సమాచారం. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందిన దీక్షిత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.ప్రాథమిక విచారణలో చదువు ఒత్తిడి, మానసిక ఆందోళనల కారణంగా ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కీసర పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహ విద్యార్థుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. చదువులో ప్రతిభ కనబరుస్తూ వైద్య రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న యువ వైద్య విద్యార్థిని అకాల మరణం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.