నాగర్‌కర్నూల్//జూలై 25 (ఆకాంక్ష) :

తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉమామహేశ్వర ఆలయానికి శనివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడగా, స్వామివారి దర్శనం కోసం పెద్ద ఎత్తున క్యూలైన్లు ఏర్పడ్డాయి.తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి దర్శనాలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టారు. తాగునీరు, వైద్యసేవలు, పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.ఇదిలా ఉండగా, నల్లమల అటవీ ప్రాంతంలోని ప్రసిద్ధ లొద్ది మల్లయ్య స్వామి దర్శనానికి అటవీశాఖ అధికారులు గతంలో విధించిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. అటవీ ప్రాంత పరిరక్షణ, భక్తుల భద్రత దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నారు. దీంతో లొద్ది మల్లయ్య స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులు నిర్దేశిత నిబంధనలను పాటిస్తూ దర్శనం చేసుకుంటున్నారు.తొలి ఏకాదశి సందర్భంగా ఉమామహేశ్వర క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు, అటవీ, దేవాదాయ శాఖల అధికారులు సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు నిర్వహించారు. భక్తుల రద్దీ సాయంత్రం వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.