భక్తులకు రానున్న రోజుల్లో రవాణా మార్గం మరింత సౌకర్యం..

కొమురవెల్లి//జూలై24(ఆకాంక్ష) : సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన శైవ పుణ్య క్షేత్రాల్లో ఒకటి. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు ఇక్కడికి తరలి వస్తుంటారు. ప్రత్యేకించి సంక్రాంతి అనంతరం ప్రారంభమయ్యే జాతర సమయంలో కోట్లాది మంది భక్తులు రాష్ట్రం నలుమూలలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో కొమురవెల్లి క్షేత్రానికి రవాణా సౌకర్యాలను మెరుగు పరచాలన్న భక్తుల చిరకాల కోరికకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది.ఇప్పటి వరకు సిద్ధిపేట–సికింద్రాబాద్–సిద్ధిపేట డెమూ రైళ్లు కొమురవెల్లి మీదుగా ప్రయాణించినప్పటికీ ఇక్కడ ఆగేవి కావు. దీంతో భక్తులు దుద్దెడ లేదా ఇతర సమీప స్టేషన్లలో దిగి రోడ్డు మార్గంలో ఆలయానికి చేరుకోవాల్సి వచ్చేది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తికాగా, ఇకపై డెమూ రైళ్లు ఇక్కడ అధికారికంగా నిలవనున్నాయి. కొత్తగా నిర్మించిన కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్‌ను ఈ నెల 26వ సాయంత్రం 3 గంటలకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2.20 గంటలకు తొలి డెమూ రైలు ఈ స్టేషన్‌లో ఆగనుంది. దీంతో కొమురవెల్లి చరిత్రలో మరో కీలక అధ్యాయం ప్రారంభం కానుంది.దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన వివరాల ప్రకారం ట్రైన్ నంబర్ 77654 సిద్ధిపేట సికింద్రాబాద్ డెమూ మరియు 77655 సికింద్రాబాద్–సిద్ధిపేట డెమూ ఈ నెల 26 నుంచి కొమురవెల్లి పుణ్యక్షేత్రం స్టేషన్‌లో ఆగనున్నాయి. అలాగే 77656 సిద్ధిపేట–సికింద్రాబాద్ డెమూ, 77653 సికింద్రాబాద్–సిద్ధిపేట డెమూ ఈ నెల 27 నుంచి ఇక్కడ హాల్ట్ కల్పించనున్నట్లు ప్రకటించింది.ట్రైన్ నంబర్ 77654 (బుధవారం మినహా) మధ్యాహ్నం 2.20 గంటలకు సిద్ధిపేట నుంచి బయల్దేరి దుద్దెడ మీదుగా 2.38 గంటలకు కొమురవెల్లి పుణ్యక్షేత్రం చేరుకుని అక్కడి నుంచి లకుడారం మీదుగా సాయంత్రం సికింద్రాబాద్‌కు చేరుతుంది. ట్రైన్ నంబర్ 77655 (బుధవారం మినహా) సాయంత్రం 5.50 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి రాత్రి 8.04 గంటలకు కొమురవెల్లి పుణ్యక్షేత్రం చేరుకుని అనంతరం సిద్ధిపేటకు వెళ్తుంది.ట్రైన్ నంబర్ 77656 (గురువారం మినహా) ఉదయం 6.45 గంటలకు సిద్ధిపేట నుంచి బయల్దేరి 7.04 గంటలకు కొమురవెల్లి పుణ్యక్షేత్రం చేరుకుని అక్కడి నుంచి సికింద్రాబాద్‌కు ప్రయాణిస్తుంది. ట్రైన్ నంబర్ 77653 సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మధ్యాహ్నం సమయంలో కొమురవెల్లి పుణ్యక్షేత్రం స్టేషన్‌లో ఆగి అనంతరం సిద్ధిపేట చేరుతుంది.


*కొమురవెల్లి మల్లన్న క్షేత్ర విశిష్టత...*


కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామిని భక్తులు ప్రేమగా మల్లన్నగా పిలుస్తారు. ఈ ఆలయం తెలంగాణ జానపద సంస్కృతికి ప్రతీకగా నిలిచింది. ఇక్కడి మల్లన్న స్వామిని పరమశివుని అవతారంగా కొలుస్తారు. స్వామి వారు భక్తులను కష్టాల నుంచి కాపాడే దైవంగా విశ్వాసం ఉంది.పురాణాల ప్రకారం మల్లన్న స్వామి దుష్ట శక్తులను సంహరించి ప్రజలను రక్షించేందుకు ఈ ప్రాంతంలో వెలిశాడని చెబుతారు. కొమురవెల్లి కొండపై స్వయంభువుగా వెలసిన ఈ క్షేత్రం శతాబ్దాల చరిత్రను కలిగి ఉంది. కాకతీయుల కాలం నుంచే ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు లభించినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. అనంతర కాలంలో వివిధ రాజవంశాలు ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డాయి. ఈ దేవాలయంలో శైవ సంప్రదాయంతో పాటు జానపద ఆచారాలకు కూడా విశేష ప్రాధాన్యం ఉంది. భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు పట్నాలు వేయడం, ఓగ్గు కథలు వినిపించడం, బోనాలు సమర్పించడం, కొబ్బరికాయలు కొట్టడం, అన్నదానం నిర్వహించడం వంటి సంప్రదాయాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.


*మహా జాతరకు విశేష ఆదరణ...*


ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత ప్రారంభమయ్యే కొమురవెల్లి మల్లన్న జాతర తెలంగాణలో అత్యంత భారీ ఆధ్యాత్మిక వేడుకల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. జాతర సమయంలో కోట్లాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. ప్రభుత్వం ప్రత్యేక రవాణా, భద్రత, వైద్య, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేపడుతుంది. ఆలయ పరిసర ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతుంది.

*రైల్వే స్టేషన్‌తో మరింత అభివృద్ధి...*

కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ ప్రారంభం వల్ల భక్తులకు ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రోడ్డు రవాణాపై భారం కూడా తగ్గనుంది. ముఖ్యంగా జాతర సమయంలో వేలాది మంది భక్తులు నేరుగా రైలు మార్గంలో ఆలయానికి చేరుకునే అవకాశం కలుగుతుంది. స్థానిక వ్యాపారులు, హోటళ్లు, రవాణా రంగం, చిన్న వ్యాపారులకు కూడా ఈ రైల్వే స్టేషన్ ద్వారా ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది. సిద్ధిపేట జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి కూడా ఈ రైల్వే స్టేషన్ కీలకంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లకు కూడా ఇక్కడ హాల్ట్ కల్పించాలని భక్తులు కోరుతున్నారు. కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి రైల్వే అనుసంధానం బలోపేతం కావడం ద్వారా తెలంగాణ ఆధ్యాత్మిక పర్యాటక రంగానికి మరింత ఊతం లభించనుంది. భక్తుల ఎన్నో ఏళ్ల ఆకాంక్ష నెరవేరడంతో కొమురవెల్లి క్షేత్రం దేశవ్యాప్తంగా మరింత చేరువ కానుందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.