– జిల్లా కలెక్టర్‌కు రైతు ఫిర్యాదు...

జగిత్యాల//జూన్ 11 (ఆకాంక్ష): ఇందిరమ్మ భూ పంపిణీ పథకం కింద తనకు కేటాయించిన భూమిని సాగు చేసుకోనివ్వకుండా కొందరు అడ్డుకుంటున్నారని, వారి నుండి ప్రాణహాని ఉందని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ జగిత్యాల రూరల్ మండలం గుట్రాజపల్లికి చెందిన రైతు కల్లేపల్లి గంగయ్య జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గురువారం కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పించి న్యాయం చేయాలని కోరారు.బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామ శివారులోని సర్వే నెం. 439/12లో 33 గుంటల భూమి సుమారు 20 సంవత్సరాల క్రితం అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ భూ పంపిణీ పథకం ద్వారా తనకు కేటాయించబడిందన్నారు.అప్పటి నుంచి ఆ భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయానికి అనుకూలంగా భూమిని అభివృద్ధి చేసి, బావి తవ్వించడంతో పాటు విద్యుత్ మోటార్ ఏర్పాటు చేసుకుని సాగు చేస్తున్నానని గంగయ్య తెలిపారు. అయితే అదే గ్రామానికి చెందిన కల్లేపల్లి అచ్చయ్య, గంగాధర్, నరేష్, రాజేశం, దేవదాస్ తదితరులు తన భూమిని సాగు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.ఒక రాజకీయ నాయకుడి అండతో తనను బెదిరిస్తున్నారని, పొలం వద్దే చంపేస్తామని హెచ్చరిస్తున్నారని గంగయ్య వాపోయారు. ఈ విషయమై గతంలో రెండుసార్లు పోలీసు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ప్రస్తుతం తనకు ప్రాణభయం ఉందని పేర్కొంటూ, అడ్డుకుంటున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. అలాగే తనకు కేటాయించిన భూమిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు చేసుకునేలా అధికారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఫిర్యాదుకు సంబంధించిన ఫైల్ కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ద్వారా జగిత్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి చేరినట్లు సమాచారం.