రూ.కోటి విలువైన వందకు పైగా సెల్‌ఫోన్లు అపహరణ...

ఖమ్మం//జూన్‌ 11 (ఆకాంక్ష): ఖమ్మం నగరంలోని జడ్పీ కార్యాలయం సమీపంలో ఉన్న సోనోవిజన్‌ మొబైల్‌ దుకాణంలో బుధవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు దుకాణం తాళాలు పగుల గొట్టి లోపలికి ప్రవేశించి రూ.కోటి విలువైన వందకు పైగా సెల్‌ఫోన్లను అపహరించినట్లు సమాచారం. గురువారం ఉదయం దుకాణానికి వచ్చిన యజమాని షాపు తాళాలు విరిగిపోవడం, సెల్‌ఫోన్లు కనిపించక పోవడం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి క్లూస్‌ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. షాపులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.చోరీకి పాల్పడిన వారి వివరాలు, నష్టం అంచనాపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.