పోలీసుల దర్యాప్తు ప్రారంభం...

కామారెడ్డి//జూన్ 11(ఆకాంక్ష) : కామారెడ్డి పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గాంధీనగర్‌కు చెందిన మహిళతో పాటు ఆమె ముగ్గురు పిల్లలు కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న యాదరం భాను ప్రకాష్ కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల షాపింగ్‌కు వెళ్లారు. అనంతరం ఆయన భార్య లయ (31), పిల్లలు బిందు (16), శివ (13), దివిజ (8) ఇంటికి తిరిగి రాలేదు. ఎంత వెతికినా వారి ఆచూకీ లభించకపోవడంతో భాను ప్రకాష్ కామారెడ్డి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అదృశ్యమైన నలుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ వారి కదలికలపై ఆరా తీస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగానే వారు స్వచ్ఛందంగా ఇంటి నుంచి వెళ్లి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అదృశ్యమైన వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.