డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయ సూపరింటెండెంట్‌కు అందజేత...

మహబూబాబాద్//జూన్11(ఆకాంక్ష) : గత కొన్ని రోజులుగా ఉపాధి హామీ పనులు కల్పించకపోవడంపై మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో ఉపాధి కూలీలు ఆందోళనకు దిగారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ, గత వారం రోజులుగా ఉపాధి పనులు కల్పించకుండా టెక్నికల్ అసిస్టెంట్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పనుల కేటాయింపుపై పలుమార్లు అధికారులను సంప్రదించినప్పటికీ సరైన సమాధానం ఇవ్వడం లేదని తెలిపారు.అలాగే గతంలో ఆరు రోజుల పాటు పని చేసినప్పటికీ మస్టర్‌లో నాలుగు రోజుల హాజరు మాత్రమే నమోదు చేసి, రెండు రోజుల కూలి చెల్లింపులను నిలిపి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమ కుటుంబాల పోషణ కష్టంగా మారిందని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం కింద అర్హులైన కూలీలందరికీ వెంటనే పనులు కల్పించాలని, మస్టర్‌లో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.ధర్నా అనంతరం కూలీలు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయ సూపరింటెండెంట్‌కు అందజేశారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు సమాచారం.