అర్హులైన ఉద్యమకారులను గుర్తించి వారికి వెంటనే భూములు కేటాయించాలి...

హైదరాబాద్//జూన్11(ఆకాంక్ష) :

టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉద్యమకారులకు ప్రభుత్వం హామీ ఇచ్చిన భూముల సాధన కోసం భూపోరాటం చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల భూపోరాటానికి సంబంధించిన పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు.జులై 2న ఉప్పల్ భగాయత్ ప్రాంతంలోని భూములను స్వాధీనం చేసుకుంటామని కవిత తెలిపారు. ఉద్యమకారులకు ఇవ్వాల్సిన 250 గజాల భూముల కేటాయింపును ప్రభుత్వం పదేపదే వాయిదా వేస్తోందని ఆమె విమర్శించారు. అర్హులైన ఉద్యమకారులను గుర్తించి వారికి వెంటనే భూములు కేటాయించాలని డిమాండ్ చేశారు.అవసరమైతే భూపోరాటం ద్వారా ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమకారుల హక్కులను కాలరాస్తూ తెలంగాణ వాదంపై దాడి చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిర్వహించే భూపోరాటానికి అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కవిత పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.