సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది...

నిర్మల్//జూన్11(ఆకాంక్ష) :

నిర్మల్ జిల్లా కేంద్రంలోని మేడిపల్లి వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ బలంగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది.ఢీకొన్న ప్రభావంతో లారీలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో డ్రైవర్ క్యాబిన్‌లో చిక్కుకుపోయి సజీవ దహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలానికి చెందిన జవారీ సింగ్గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.