ప్రజల భద్రతకు సాంకేతికతే కీలకం : డీజీపీ సి.వి. ఆనంద్...

ఆదిలాబాద్//జూన్10(ఆకాంక్ష) :

ప్రజలకు మరింత మెరుగైన భద్రతా సేవలు అందించేందుకు తెలంగాణ పోలీసు శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నట్లు సి.వి. ఆనంద్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన 300 సీసీటీవీ కెమెరాలను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపులో సీసీటీవీ నిఘా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఆధునిక సాంకేతికత సహకారంతో పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. అనంతరం మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుపై అవగాహన కల్పించారు.జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 300 సీసీటీవీ కెమెరాల్లో 220 గ్రామీణ ప్రాంతాల్లో, 80 పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కెమెరాల ద్వారా ప్రజల భద్రత మరింత బలోపేతం కావడంతో పాటు నేరాల నియంత్రణకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో చారు సిన్హా, ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, అఖిల్ మహాజన్, పి. మౌనిక, రుత్విక్ సాయి కొట్టే, ఎల్. జీవన్ రెడ్డి, బి. సునీల్ కుమార్ తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.