– సైబర్ నేరాలపై అవగాహన...

మెదక్//జూన్ 10(ఆకాంక్ష) :

నేరాల నిర్మూలన, ప్రజల రక్షణ, భద్రతాభావం కల్పించడమే లక్ష్యంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తెలిపారు. మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్‌లో బుధవారం నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు.ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడం, నేరాల నియంత్రణకు పోలీసు-ప్రజల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో 70 మంది పోలీసు సిబ్బంది పాల్గొని విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 45 వాహనాలను తాత్కాలికంగా సీజ్ చేశారు. సంబంధిత వాహన యజమానులు అవసరమైన పత్రాలు సమర్పించి తమ వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు.అద్దెకు ఇళ్లు తీసుకునే కొత్త వ్యక్తుల పూర్తి వివరాలను సేకరించాలని, ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని ప్రజలకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ఈ సందర్భంగా డిజిటల్ అరెస్ట్, ఫోన్ కాల్ బ్లాక్‌మెయిల్, ఓటీపీ మోసాలు, పార్ట్‌టైమ్ జాబ్ ఫ్రాడ్స్, ఫేక్ లింకుల ద్వారా జరిగే సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద కాల్స్, సందేశాలకు స్పందించకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐలు మహేష్, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.