ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో అరెస్టైన జలమండలి జనరల్ మేనేజర్...

హైదరాబాద్//జూన్10(ఆకాంక్ష) :

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో అరెస్టైన జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీకుమార్‌కు రెండు రోజుల కస్టడీని ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. ఈ మేరకు ఏసీబీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం కస్టడీకి అనుమతి ఇచ్చింది.అనంత లక్ష్మీకుమార్ నివాసాలు, కార్యాలయాల్లో ఇటీవల నిర్వహించిన సోదాల్లో ఏసీబీ అధికారులు భారీ స్థాయిలో అక్రమ ఆస్తులను గుర్తించారు. తనిఖీల్లో రూ.1.10 కోట్ల నగదు, 2.1 కిలోల బంగారు ఆభరణాలు, 9.2 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా హైదరాబాద్‌తో పాటు నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు గుర్తించారు.
స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలు, బ్యాంకు ఖాతాల లావాదేవీల ఆధారంగా అనంత లక్ష్మీకుమార్‌ను అధికారులు ప్రశ్నించనున్నారు. ఆయన ఆస్తుల సమీకరణకు సంబంధించిన వివరాలతో పాటు నిధుల మూలాలపై ఆరా తీసేందుకు సిద్ధమయ్యారు.ఇదిలా ఉండగా, అనంత లక్ష్మీకుమార్‌కు బినామీలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బినామీ ఆస్తులు, ఆర్థిక లావాదేవీల కోణంలోనూ ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసు దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.