తమిళ, తెలుగు చిత్రసీమలో విషాదఛాయలు...

చెన్నై//జూన్10(ఆకాంక్ష) :

తమిళ సినీ పరిశ్రమకు మార్గదర్శకుడిగా నిలిచిన ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా (84) బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. భారతీరాజా మరణవార్తతో తమిళ సినీ పరిశ్రమతో పాటు తెలుగు చిత్రసీమలోనూ తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.1941 జూలై 17న తమిళనాడులోని అల్లినగరంలో జన్మించిన భారతీరాజా, గ్రామీణ జీవితాన్ని వెండితెరపై సహజత్వంతో ఆవిష్కరించి తమిళ సినిమాకు కొత్త దిశను చూపించారు. 1977లో విడుదలైన 16 వయతినిల్ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసి, తమిళ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తెలుగులోనూ ఆయనకు విశేష గుర్తింపు లభించింది. ‘సీతాకోకచిలుక’ చిత్రానికి జాతీయ ఉత్తమ తెలుగు చిత్ర అవార్డు దక్కగా, 1981లో అదే చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నారు. అలాగే 1986లో తెరకెక్కించిన ముద్దల్ మఱియాదై చిత్రానికి జాతీయ ఉత్తమ తమిళ చిత్ర అవార్డు లభించింది.భారతీయ సినీ రంగానికి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా 2004లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. అనంతరం అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలతో పాటు 2014లో సైమా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు కూడా అందుకున్నారు. దశాబ్దాల పాటు తన వినూత్న కథనశైలి, గ్రామీణ నేపథ్య చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన భారతీరాజా మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటుగా సినీ ప్రముఖులు పేర్కొంటున్నారు.