భార్యపై అనుమానంతో కాల్పులు...

హైదరాబాద్//జూన్10(ఆకాంక్ష) :

హైదరాబాద్ నగరంలోని మల్కాజ్‌గిరి పరిధి మారుతినగర్‌లో తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ స్థిరాస్తి వ్యాపారి ఆమెను తుపాకీతో కాల్చిచంపాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసుల వివరాల ప్రకారం.. మారుతినగర్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి కుమార్ తన రెండో భార్య నిషారాణిపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో తెల్లవారుజామున ఇంట్లోనే ఆమెపై తుపాకీతో రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన నిషారాణి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. కాల్పుల శబ్దాలు విని భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.ఇదిలా ఉండగా, నిందితుడు కుమార్ మూడు నెలల క్రితం వాహన తనిఖీల సందర్భంగా తుపాకీతో పట్టుబడినట్లు తెలిసింది. అప్పట్లో అంబర్‌పేట పోలీసులు ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అయినప్పటికీ కుమార్ మరో తుపాకీని సమకూర్చుకుని ఈ హత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, కుమార్ తొలి భార్యతో విభేదాలు తలెత్తడంతో ఆమె విడిచి వెళ్లిపోయింది. అనంతరం ఆమె సోదరి నిషారాణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్న కుమార్ తరచూ వేధింపులకు పాల్పడుతున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.