– జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశం...

సిరిసిల్లటౌన్//జూన్04(ఆకాంక్ష) :


రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు, తరలింపు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టి పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు. అపరెల్ పార్క్, గోదాముల్లో ధాన్యం నిల్వకు అనుగుణంగా హమాలీల సంఖ్యను పెంచాలని సూచించారు.గురువారం పౌర సరఫరాల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, సహకార శాఖ, మెప్మా, రవాణా శాఖ, వ్యవసాయ శాఖ తదితర శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి టెలికాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ స్థితి,హమాలీల అందుబాటు, గన్నీ సంచుల లభ్యత, ఇప్పటి వరకు మూసివేసిన కేంద్రాల వివరాలను ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు.కొనుగోళ్లు తుది దశకు చేరిన కేంద్రాల నుంచి హమాలీలు, వాహనాలను అవసరమైన ఇతర కేంద్రాలకు తరలించాలని సూచించారు. ధాన్యం రవాణా కోసం కాంట్రాక్టర్లు తగినంత వాహనాలను సమకూర్చాలని ఆదేశించారు. ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు, అన్‌లోడింగ్, తరలింపు ప్రక్రియలను మరింత వేగవంతం చేయాలని, అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ గరిమ అగర్వాల్ పేర్కొన్నారు.