ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడి చేసి హత్య చేసిన యువకుడు...

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ప్రేమోన్మాది దాడి ఘటన మరింత విషాదకరంగా మారింది. శనివారం రాత్రి యువతిని కిరాతకంగా గొంతుకోసి హత్య చేసిన ఉన్మాది తేజ, స్థానికుల దాడిలో తీవ్రంగా గాయపడగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సంచలనం రేపుతోంది.వివరాల్లోకి వెళ్తే.. ప్రేమను నిరాకరించిందనే కారణంతో యువతి ఇంటి వద్దకు వెళ్లిన తేజ, తీవ్ర ఆగ్రహంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు. అత్యంత దారుణంగా గొంతుకోసి హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. యువతి కేకలు విని అక్కడికి చేరుకున్న స్థానికులు తేజను పట్టుకుని చితకబాదారు. ఈ దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని యువతిని, తేజను ఆస్పత్రికి తరలించారు. అయితే యువతి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న తేజ పరిస్థితి విష మించడంతో ఆస్పత్రిలో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.