గ్రామంలో విషాద ఛాయలు...

జడ్చర్ల//మే16(ఆకాంక్ష) :

జడ్చర్ల జిల్లా ఊర్కొండ మండలం ఊర్కొండపేట శివారులో శనివారం జరిగిన హృదయ విదారక ఘటనలో సరదాగా సహచరులతో కలిసి బావిలో ఈతకు దిగిన ఓ యువకుడు నీటిలో మునిగి మృతిచెందాడు. సుమారు 30 మందికి పైగా యువకులు ఒకేసారి బావిలో ఈత కొడుతూ ఉండటంతో ప్రమాదంలో పడిన సహచరుడు కనిపించకుండా పోవడం ఎవరికీ వెంటనే తెలియకపోవడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ కార్మికురాలి చెల్లెలి కుమారుడు కాలే అనిల్ (20) పెద్దమ్మ వద్ద ఉంటూ విద్యాభ్యాసం కొనసాగిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం గ్రామ శివారులోని బావి వద్దకు స్నేహితులు, సోదరులతో కలిసి వెళ్లిన అనిల్ సుమారు గంటపాటు అందరితో కలిసి ఆనందంగా ఈత కొట్టాడు. అయితే బావిలో భారీ సంఖ్యలో యువకులు ఒకేసారి ఉండటంతో ఎవరు ఎక్కడ ఉన్నారో గమనించలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో అందరూ ఈత ముగించి బయటకు రావడానికి సిద్ధమైన సమయంలో అనిల్ కనిపించక పోవడంతో స్నేహితులు, బంధువులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే బావి చుట్టూ గాలించినప్పటికీ అతడి ఆచూకీ లభించకపోవడంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి కల్వకుర్తి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న కల్వకుర్తి ఫైర్ స్టేషన్ అధికారి చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని బృందం బావిలో గాలింపు చర్యలు చేపట్టి, కొంతసేపటి తర్వాత నీటిలో మునిగిపోయిన అనిల్ మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని బయటకు తీసిన దృశ్యం చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం ప్రకారం మృతి చెందిన యువకుడు కాలే అనిల్ తలకొండపల్లి మండలం చౌదరపల్లి గ్రామానికి చెందినవాడని స్థానికులు తెలిపారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. వేసవి కాలంలో బావులు, చెరువులు, కుంటల్లో యువత గుంపులుగా ఈతకు వెళ్లడం ప్రమాదకరమని, అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.