మాజీ సర్పంచ్ లావణ్య నాగరాజ్ డిమాండ్...

గోదావరిఖనిటౌన్//మే 16 (ఆకాంక్ష) :

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కొందరు వ్యక్తులు లారీతో కూల్చివేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రజల దాహార్తి తీర్చేందుకు స్వంత ఖర్చులతో ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాన్ని ధ్వంసం చేయడం దారుణమని జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు, మాజీ సర్పంచ్, సామాజిక కార్యకర్త రామగిరి లావణ్య నాగరాజ్ తీవ్రంగా ఆరోపించారు. ఈ ఘటనపై ఆమె మాట్లాడుతూ, ప్రజల అవసరాల కోసం వేసవిలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాజకీయ కక్షతో లక్ష్యంగా చేసుకుని కొందరు కాంగ్రెస్ కార్యకర్తలే లారీతో కూల్చివేశారని ఆరోపించారు.చలివేంద్రం వద్ద ఉన్న సిమెంట్ బెంచీలు, షెడ్ నిర్మాణం, నీటి డ్రమ్ములను పూర్తిగా ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత కలిగినవారు ఇలాంటి చర్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమని ఆమె అన్నారు.ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టినట్లు సమాచారం. అయితే బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని లావణ్య నాగరాజ్ డిమాండ్ చేశారు. కేవలం కూల్చివేతకు పాల్పడిన వారిపై మాత్రమే కాకుండా, లారీ యజమానిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆమె కోరారు.అలాగే ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని కాంగ్రెస్ పార్టీ నుంచి తక్షణమే బహిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజల సేవ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, ఇలాంటి చర్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.గ్రామస్తులు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలను ధ్వంసం చేయడం వల్ల గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు తెలిపారు. పూర్తి స్థాయి విచారణ జరిపి నిజా నిజాలు వెలికితీయాలని సామాజిక కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు అధికారులను కోరుతున్నారు.