– పెను ప్రమాదం తప్పిన ఘటన...

ప్రకాశం//మే16(ఆకాంక్ష) :

ప్రకాశం జిల్లా రాజుపాలెం వద్ద శనివారం ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వైపు వెళ్తున్న కావేరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా ఇంజిన్ భాగంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం మేరకు, బస్సు రాజుపాలెం సమీపానికి చేరుకున్న సమయంలో ఇంజిన్ నుండి పొగలు రావడం గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు. తక్షణమే బస్సును రహదారి పక్కన నిలిపివేసి ప్రయాణికులను బయటకు దించారు. కొద్ది క్షణాల్లోనే మంటలు తీవ్రంగా వ్యాపించగా బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది.సుమారు 36 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ సమయస్ఫూర్తి కారణంగా అందరూ సురక్షితంగా బయటపడటంతో భారీ ప్రాణనష్టం తప్పింది. ఘటనపై స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు ప్రయాణికుల్లో ఆందోళనను పెంచుతున్నాయి. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.